: శశికళకు జైలులో ప్రత్యేక సదుపాయాలపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం
పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ వీకే శశికళకు జైలులో అందుతున్న ప్రత్యేక సదుపాయాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. జైళ్ల శాఖ సీనియర్ అధికారులకు ఆమె రూ.2 కోట్లు లంచం ఇచ్చి ప్రత్యేక సదుపాయాలు పొందుతున్నట్టు వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు.
జైలులోని శశికళ గదిలో ప్రత్యేకంగా వంటగది ఉందని, ఆమెకు వంట చేసేందుకు ప్రత్యేకంగా వంట మనిషి కూడా ఉన్నారని, ఇతర సదుపాయాలు కూడా ఆమె పొందుతున్నారంటూ డీఐజీ (ప్రిజన్స్) డి.రూప.. డీజీపీ (ప్రిజన్స్) హెచ్ఎన్. సత్యనారాయణరావుకు లేఖ రాయడం కలకలం రేపింది. డీఐజీ రూప లేఖతో తమిళనాడులో పెను దుమారమే చెలరేగింది. డీఎంకే, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు అన్నాడీఎంకేపై దుమ్మెత్తిపోశారు. అలాగే సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వెంటనే ఈ విషయంపై విచారణకు ఆదేశించారు.