: ఆస్తి కోసం కన్నతండ్రిని దారుణంగా కొట్టిన కుమారులు... చోద్యం చూసిన స్థానికులు!
ఆస్తి కోసం ఇద్దరు సోదరులు తమ తండ్రిని చిత్ర హింసలు పెట్టి దారుణంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటకలోని బాగల్ కోటలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతుండగా తీసిన వీడియో బయటకు రావడంతో ఆ పుత్రరత్నాల కర్కశత్వం బయటపడింది. తండ్రి ఆస్తి మొత్తాన్ని తమకు రాసివ్వలేదన్న ఆగ్రహంతో తండ్రిని ఈడ్చుకెళ్లిన ఆ కుమారులు అతడి కాళ్లు, చేతులను కట్టేసి, తీవ్రంగా కొట్టారు. అనంతరం తండ్రిని పొలంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.
ఆ వృద్ధుడిని తనయులు కొడుతుంటే స్థానికులు ఓ సినిమా చూసినట్లు చూశారే తప్పా, ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ తండ్రి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.