: నిశ్చితార్థం వార్తలపై స్పందించిన సోనమ్!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ త్వరలో పెళ్లికూతురు కానుందని, నిశ్చితార్థం ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త ఆనంద్ అహుజాతో సన్నిహితంగా ఉంటున్న ఆమెను నిశ్చితార్థం విషయం గురించి ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టిపారేసింది. అలాగే ట్విట్టర్ ద్వారా కూడా ఈ ఊహాగానాలకు ఘాటుగా సమాధానమిచ్చింది అనిల్ కపూర్ గారాల తనయ.
`ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీరు నా వ్యక్తిగత జీవితం మీద ఎందుకు ఆసక్తి చూపుతున్నారు?` అంటూ ఆమె ట్వీట్ చేసింది. అలాగే తనకు ఎలాంటి ఎంగేజ్‌మెంట్ జరగలేదని స్పష్టం చేసింది. గత వారం ఆనంద్ అహుజాతో సోనమ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని నెట్లో హల్‌చల్ చేశాయి. వ్యక్తిగత విషయాలు పెద్దగా బయటికి రానివ్వని సోనమ్ కపూర్‌కు ఆనంద్‌తో నిశ్చితార్థం జరగనుందని ఆ ఫొటోలు చూసి నెటిజన్లు పుకారు సృష్టించారు. ఇక సినిమాల విషయానికొస్తే సంజయ్ దత్ జీవితగాథతో తెరకెక్కుతున్న సినిమాతో పాటు, అక్షయ్‌కుమార్ సరసన `ప్యాడ్‌మన్` సినిమాలో కూడా సోనమ్ నటిస్తోంది.