: ఇంటర్నెట్ బ్యాంకింగ్ నగదు బదిలీ ఛార్జీలను భారీగా తగ్గించిన ఎస్‌బీఐ
ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంతో భారతీయ స్టేట్ బ్యాంక్ ఇంటర్నెట్ ఆధారిత చెల్లింపు సేవలైన ఎన్ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ల ఛార్జీలను భారీగా తగ్గించింది. జూలై 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ ప్రకటించింది. నెఫ్ట్ ద్వారా రూ. 10 వేల వరకు పంపితే రూ. 1 ఛార్జీ పడనుంది. ఇంతకుముందు ఇది రూ. 2గా ఉండేది. అలాగే రూ. 10 వేల నుంచి లక్ష పంపిస్తే రూ. 2, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు పంపితే రూ. 3, రూ. 2 లక్షలు ఆపైన పంపిస్తే రూ. 5 ఛార్జీ చేయనున్నారు.
ఇంతకు ముందు ఛార్జీలతో పోలిస్తే ఇవి 75 శాతం వరకు తక్కువ. పెద్ద మొత్తాలు బదిలీ చేసుకోవడానికి సౌకర్యవంతమైన ఆర్‌టీజీఎస్ ఛార్జీలను కూడా ఎస్‌బీఐ భారీగా తగ్గించింది. ఇంతకుముందు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలు బదిలీ చేయాలంటే రూ. 20 చెల్లించాల్సివచ్చేది. ఇక నుంచి కేవలం రూ. 5కే ఈ బదిలీ చేసుకోవచ్చు. అలాగే రూ. 5 లక్షలపైన బదిలీల ఛార్జీ కూడా రూ. 10కి తగ్గించినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ ఛార్జీలతో పాటు సంబంధిత మొత్తంపై పడే 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.