: నాన్నపై ప్రేమతో.... పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆది!
తన పేరులో తండ్రి పేరును చేర్చుకుని, తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడో టాలీవుడ్ యువ హీరో. `ప్రేమ కావాలి` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో ఆది ఇక నుంచి తనని `ఆది సాయికుమార్` అని సంబోధించాలని చెబుతున్నాడు. సాయికుమార్ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన ఆయన ఇకపై తండ్రి పేరును తన పేరుతో కలిపేసుకుని చలామణి అవనున్నాడు. తన తర్వాతి చిత్రం `శమంతకమణి` టైటిల్ కార్డ్స్‌లో కూడా ఇలాగే పడుతుందట.
మరీ ఇంత అకస్మాత్తుగా పేరు ఎందుకు మార్చుకున్నాడో తెలుసా! `శమంతకమణి సినిమాలో నటించే హీరోల పేర్లన్నీ పెద్దగా ఉన్నాయి. మీ పేరు మాత్రమే పొట్టిగా ఉంది. మారుద్దాం` అని సలహా ఇచ్చాడట దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఆ మేరకు తన పేరును `ఆది సాయికుమార్` అని మార్చుకున్నానని, అది బాగుండటంతో తర్వాత కూడా ఇలాగే కొనసాగుతానని ఆది చెప్పాడు. సందీప్ కిషన్, నారా రోహిత్, సుదీర్ బాబు, ఆది హీరోలుగా నటించిన `శమంతకమణి` చిత్రం జూలై 14న విడుదల కానుంది.