: 'జెమిని' సినిమా విలన్ హత్య కేసులో కూడా దిలీప్ హస్తం?
మాలీవుడ్ లో పెను కలకలం రేపిన స్టార్ హీరో దిలీప్ (48) కేసులో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన దిలీప్ పై కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'జెమిని' సినిమాతో తెలుగు తెరకు విలన్ గా పరిచయమైన నటుడు కళాభవన్ మణి హత్య కేసుతో కూడా ఇతనికి సంబంధం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సోదరుడి హత్య కేసులో దిలీప్ కు సంబంధం ఉందని మణి సోదరుడు రామకృష్ణన్, దర్శకుడు బైజు కొట్టారక్కర తాజాగా ఆరోపించారు.
దీనికి సంబంధించిన ఆధారాలు సీబీఐకి అందించామని వారు తెలిపారు. ఈ విషయాన్ని కోజికోడ్ కు చెందిన ఒక మహిళ తనకు చెప్పిందని దర్శకుడు బైజు తెలిపారు. మణితో భూముల విషయంలో దిలీప్ గొడవపడ్డాడని ఆయన సీబీఐకి తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, భావన కేసు విషయంలో దిలీప్ అరెస్టు అనంతరం అతని సోదరుడిని విచారించిన పోలీసులు, తాజాగా దిలీప్ తల్లి సరోజమ్మ పిళ్ళైని విచారిస్తున్నారు.