: జైలులో నేనేం చూశానో అదే రిపోర్టులో రాశాను... ఇతర విషయాలు పై అధికారులే చూసుకుంటారు: డీఐజీ రూప
కర్ణాటక పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు రాజభోగాలు అందుతున్నాయని జైళ్ల డీఐజీ రూపా ముద్గల్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తాను పంపిన రిపోర్ట్ ను డీజీపీతో పాటు అడిషనల్ డీజీపీ సత్యనారాయణ ఖండించడంపై ఆమె మాట్లాడుతూ, జైలులో తాను ఏం చూశానో వాటినే రిపోర్టు రూపంలో పంపించానని స్పష్టం చేశారు.
డీజీపీ ఎందుకలా చెప్పారో తనకు తెలియదని చెప్పిన రూప... జైలులో శశికళకు ప్రత్యేకమైన వంటగది ఉందని అన్నారు. మరికొందరికి కూడా ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నాయని ఆమె తెలిపారు. శశికళకు ప్రత్యేక సౌకర్యాల విషయంలో 2 కోట్ల రూపాయలు చేతులు మారాయని జైలు ఖైదీలే మాట్లాడుకుంటారని చెప్పారు. తన పని నివేదిక ఇవ్వడం వరకేనని, ఉన్నతాధికారులకు ఆ నివేదికను అందజేశానని ఆమె అన్నారు. అయితే దానిలోని అంశాలపై చర్యలు తీసుకోవడం, తీసుకోకపోవడం అధికారుల చేతుల్లోనే ఉందని ఆమె చెప్పారు. ఆమె ఆరోపణలు కర్ణాటకతో పాటు, తమిళనాడులో కూడా కలకలం రేపుతున్నాయి.