: ఇకపై ఎక్కడా సోఫాలు, ఏసీలు వద్దు: అధికారులకు యోగి ఆదిత్యనాథ్ సీరియస్ వార్నింగ్
తాను ఎక్కడికైనా పర్యటనలకు, పరామర్శలకు వెళితే, ఆగమేఘాల మీద రెడ్ కార్పెట్లు పరిచి, సోఫాలు, ఏసీలను అమర్చి, పర్యటన ముగియగానే వాటిని తీసేస్తూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారుల వైఖరిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. వారికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ, ఇకపై తన కోసం ఎటువంటి విలాస వస్తువులనూ అమర్చరాదని, ఎక్కడా ఏసీలు, సోఫాలను వేయవద్దని, ప్రత్యేక ఏర్పాట్లకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఇటీవల బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ మరణించగా, అతని ఇంటికి యోగి బయలుదేరిన వేళ, అధికారుల వైఖరిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తమ చేతికి చిక్కిన, ప్రేమ్ సాగర్ ను చిత్ర హింసలకు గురి చేసిన పాక్ ముష్కరులు, అతని మృతదేహాన్ని ఖండాలుగా చేశారు. ఆయన ఇంటికి సీఎం పరామర్శకు వస్తున్నారని తెలుసుకుని మెప్పు పొందాలన్న అత్యుత్సాహంతో, ప్రేమ్ సాగర్ ఇంట్లో ఏసీ, సోఫాలను అమర్చిన అధికారులు, ఆయన వెళ్లిపోగానే వాటిని తొలగించారు. ఆ నేపథ్యంలోనే యోగి ఆదిత్యనాథ్ తాజా ఆదేశాలు జారీ చేశారు.