: గ్రీన్‌కార్డ్ కోసం ఇక 12 ఏళ్ల నిరీక్షణ అవసరం లేదు.. కొత్త బిల్లు వస్తోంది!
భారతీయ ఉద్యోగులు అమెరికాలో గ్రీన్‌కార్డ్ పొందాలంటే 12 ఏళ్ల పాటు నిరీక్షించాలంటూ వచ్చిన రిపోర్ట్‌పై అమెరికా నేతలు స్పందించారు. దీనికి సంబంధించి ఒక బిల్లును కాన్సస్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్‌మెన్ కెవిన్ యోడర్ ప్రవేశపెట్టారు. ఈ సమస్యకు కారణమైన `దేశ ఆధారిత గ్రీన్‌కార్డ్ జారీ` నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నైపుణ్యం గల వలస ఉద్యోగుల చట్టంలో ఈ నిబంధన ఉండటం వల్ల భారత్, చైనా వంటి అధిక జనాభా దేశాల నుంచి వచ్చే వారికి అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్‌లో ఉన్న 230 మందిలో ఇప్పటికే 100 మందికి పైగా నేతలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే `దేశ ఆధారిత గ్రీన్‌కార్డ్ జారీ` నిబంధనని తొలగిస్తారు.
ప్రస్తుతం ఈ నిబంధన ప్రకారం స్వతంత్ర దేశం నుంచి వచ్చిన ఉద్యోగి కుటుంబాలకు అందుబాటులో ఉన్న గ్రీన్‌కార్డ్‌లలో 7 శాతం మంజూరు చేయాలి. దీంతో భారత్, చైనాల నుంచి వచ్చిన వారితో సమానంగా చిన్న దేశం గ్రీన్‌లాండ్ నుంచి వచ్చిన ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు అందుతున్నాయి. పెద్ద దేశాల నుంచి దరఖాస్తు దారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి సంవత్సరం వారి గ్రీన్‌కార్డ్ దరఖాస్తు వెనకబడి, ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అలాగే ఈ బిల్లు అమలులోకి వస్తే తాత్కాలిక వీసా మీద అమెరికాలో పనిచేసే వారికి కూడా మరింత ప్రయోజనం చేకూరనుంది.