: సైనికులకు మరో విజయం... డీఎస్పీ అయూబ్ పండిట్ ను హత్య చేసిన హిజ్బుల్ టెర్రరిస్టు హతం
గత నెల 22న శ్రీనగర్ లోని చారిత్రాత్మక జామియా మసీదు ముందు డీఎస్పీ అయూబ్ పండిట్ ను దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో ప్రధాన సూత్రధారి, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సాజిద్ అహ్మద్ గిల్కర్ ను బుడ్గాం జిల్లాలో భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న నౌహట్టాలో సీఆర్పీఎఫ్ దళాలపై గ్రనేడ్ దాడి కేసుతో పాటు, అదే నెల 30న ఖాన్యార్ లో పోలీసు పార్టీపై దాడి, జూన్ 21న సఫాకదల్ క్యాంపుపై దాడి కేసులో సాజిత్ ప్రధాన నిందితుడని తెలిపారు.
తన అనుచరులు ఆఖిబ్ గుల్, జావేద్ అహ్మద్ షేక్ లతో కలసి సాజిద్ పలు నేరాలకు పాల్పడ్డాడని, అతను ఆశ్రయం పొందిన ఇంటి వివరాలను తెలుసుకున్న పోలీసులు ఎన్ కౌంటర్ జరిపి మట్టుబెట్టారని తెలిపారు. ఈ సందర్భంగా సాజిద్, పోలీసులపై తుపాకులు పేలుస్తూ విరుచుకుపడ్డాడని, రాత్రంతా ఎన్ కౌంటర్ సాగిందని, అతను తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించగా, భద్రతా దళాలు కాల్చి చంపాయని తెలిపారు. ఈ ఘటనలో సాజిద్ తో పాటు అతనితో ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని వెల్లడించారు.