: ఆఫీసు మూసేస్తున్నాం.. వేరే మార్గాలు వెతుక్కోండి: లక్నో సెంటర్ ఉద్యోగులకు స్పష్టం చేసిన టీసీఎస్
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ లక్నోలోని తన కార్యాలయాన్ని మూసివేయబోతోంది. ఈ సెంటర్ ను మూసి వేస్తున్నట్టు ఇప్పటికే ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు టీమ్ లీడర్లు సమాచారం అందించారని నిన్న ఓ ప్రకటనలో తెలిపింది. టీసీఎస్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో 2 వేల మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వీరిలో సగం మంది మహిళా ఉద్యోగులే. మరోవైపు, ఈ ఏడాది చివరికల్లా టీసీఎస్ తమ మెజారిటీ ప్రాజెక్టులను నోయిడాకు తరలించనున్నట్టు తెలుస్తోంది.
టీసీఎస్ నిర్ణయంతో రోడ్డున పడనున్న ఉద్యోగులంతా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. ఈ విషయంలో తమరు కల్పించుకోవాలని, తమ ఉద్యోగాలకు భద్రతను కలిగించాలని లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. దీనికి తోడు ప్రధాని మోదీ, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మలకు కూడా లేఖలను రాశారు. గత 33 ఏళ్లుగా లక్నోలోని టీసీఎస్ కార్యాలయం కార్యకలాపాలను నిర్వహిస్తోంది.