: నా బిడ్డను నేను చంపుకుంటానా? లాలూతో తెగతెంపులు లేవని కుండబద్దలు కొట్టిన నితీశ్
బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ తో కటీఫ్ చెప్పే అవకాశాలే లేవని సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. లాలూతో కలసి పెంచుకున్న బిడ్డే 'మహాఘటబంధన్' అని అభివర్ణించిన ఆయన, తన బిడ్డను తానే ఎలా చంపుకుంటానని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో టెలిఫోన్ లో మాట్లాడిన ఆయన, ఆపై తన మనసులోని మాట చెప్పారు. తెగదెంపులు ఉండబోవని కుండబద్దలు కొట్టారు.
లాలూ కుటుంబంపై సీబీఐ దాడులు, అంతకన్నా ముందు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ను కాదని, మోదీ ఎంపిక చేసిన కోవింద్ కు మద్దతు పలకడం తదితర పరిణామాలతో నితీశ్, లాలూ మధ్య బంధం విడనుందని, ఆ తరువాత బీజేపీ మద్దతుతో నితీశ్ ప్రభుత్వం కొనసాగుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక లాలూ ఇళ్లపై సీబీఐ దాడులు మొదలైన తరువాత, తొలిసారిగా క్యాబినెట్ సమావేశాన్ని నితీశ్ ఏర్పాటు చేయగా, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా హాజరయ్యారు. ఆపై ఆయన మాట్లాడుతూ, అమిత్ షా, నరేంద్ర మోదీలు తమ కుటుంబంపై కక్ష కట్టారని ఆరోపించారు. నితీశ్ తాజా వ్యాఖ్యలతో తేజస్వీ యాదవ్ పదవికి, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు లేనట్టే.