: ముంబైలో ఆవుపేడతో గణేశుడి విగ్రహాలు!
ముంబైలోని నేరుల్ ప్రాంతానికి చెందిన నీలేశ్ తూపే ఆవుపేడతో గణేశుడి విగ్రహాలు తయారుచేసి విక్రయిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణలో ఇదో కొత్త మలుపుగా ఆయన పరిగణిస్తున్నారు. ముంబైలో ఆడిటర్‌గా పనిచేసే ఆయన రాజస్థాన్‌లోని గోశాలల నుంచి తెప్పించిన పేడతో ఈ విగ్రహాలు తయారుచేస్తున్నారు. ఆవుపేడ, గోమూత్రం, పాలు, పెరుగుతో పర్యావరణసహిత మందులు, పదార్థాల తయారీని ప్రోత్సహించే `పంచగవ్య చికిత్స సంఘ్`లో నీలేశ్ తూపే సభ్యత్వం తీసుకున్నారు.
ఆ సంఘంలో ఉన్న కొంతమంది స్నేహితుల సలహాతో ఆవుపేడతో గణేశుని విగ్రహాల తయారీ మొదలుపెట్టానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఈ విగ్రహాలను తీసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని, ఇతర ప్రాంతాలకు కూడా తన విగ్రహాలను పంపుతున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మన పూర్వీకులు పర్యావరణానికి హాని కలగకుండా పండగలు జరుపుకునేవారని, మనం కూడా అలా ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతోనే ఆయన విగ్రహాల తయారీ ప్రారంభించినట్లు చెప్పారు.