: నోయిడాలో పనిమనిషిపై దాష్టీకం... సంఘటనను హైలైట్ చేసిన ఫారిన్ మీడియా!


తమ ఇంట్లో పని చేస్తున్న ఓ మహిళపై భారత కుటుంబం దాష్టీకానికి దిగిందని, ఈ ఘటనతో న్యూఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని విదేశీ మీడియా ఓ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. తోటి పనిమనిషి ఆపదలో ఉందని తెలుసుకున్న 150 మంది పనివాళ్లు నోయిడా పరిధిలోని లగ్జరీ అపార్టుమెంటు మగాహున్ మోడరన్ కాంప్లెక్స్ పై రాళ్ల దాడికి దిగారని, పోలీసులు రంగంలోకి దిగి వారిపై లాఠీ చార్జ్ చేశారని 'ది వాషింగ్టన్ పోస్టు' ఓ వార్తను ప్రచురించింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుపుతూ, జోహ్రా బీబీ అనే యువతి ఓ అపార్టుమెంట్లో పనిమనిషిగా పని చేస్తోందని, ఇంట్లో పోయిన విలువైన వస్తువులను ఆమే కాజేసిందని యజమానులు ఆరోపించగా, తనకు రావాల్సిన సుమారు రూ. 8 వేల జీతం గురించి ఆమె ప్రశ్నించిందని తెలిపింది.

 ఆపై జోహ్రాను ఇంట్లోనే యజమానులు నిర్బంధించారని, రాత్రంతా ఇంటికి రాకపోయేసరికి ఆమె భర్త అబ్దుల్ సత్తార్ విషయాన్ని తోటి పనివారికి చెప్పడంతో రభస మొదలైందని పేర్కొంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారని, జోహ్రాను విడిపించారని తెలిపింది. "నేను పరిగెత్తి ఇంట్లోంచి వెళ్లిపోవాలని చూస్తే చంపస్తానని మేడమ్ నన్ను హెచ్చరించింది" అని జోహ్రీ బయటకు వచ్చిన తరువాత పేర్కొంది. ఇరు వర్గాల వారూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండటంతో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏకే సింగ్ విచారిస్తున్నారని తెలిపింది.

ఇక ఇండియాలో పనిమనుషుల సంఖ్య చాలా అధికమని, వారికి కనీస గౌరవం, వేతనాలు దక్కడం లేదని, ఎన్నో దశాబ్దాలుగా వారు అట్టడుగునే ఉండిపోయారని తృప్తీ లహరీ అనే రచయిత, ఇటీవల రాసిన 'మెయిడ్ ఇన్ ఇండియా' అనే పుస్తకంలోని వివరాలను 'ది వాషింగ్టన్ పోస్టు' ప్రస్తావించింది. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉందని తెలిపింది. "వారు ముందు తింటారు. మేము మిగిలింది తినాలి. ఇంట్లో ఎక్కడో వెనుక చిన్న గదిలో ఉండిపోవాలి. వారు కుర్చీల్లో సేదదీరుతుంటే, మేము కింద కూర్చోవాలి. వారు ఖరీదైన గ్లాసుల్లో తాగుతుంటే, మేము సత్తు గిన్నెలే వాడాలి. మేము గౌరవంగా పిలుస్తుంటే, మమ్మల్ని చీత్కారంగా సంబోధిస్తుంటారు" అని ఓ పనిమనిషి చెప్పిన మాటలనూ ప్రస్తావించింది.

  • Loading...

More Telugu News