: సౌదీలో అగ్నిప్రమాదం.. ఊపిరి ఆడక 11 మంది భారతీయుల దుర్మరణం
సౌదీ అరేబియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరిలో ఎంత మంది తెలుగువారు ఉన్నారో ఇంకా తెలియరాలేదు. సౌదీలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న నజ్రాన్ పట్టణంలో ఈ ప్రమాదం నిన్న రాత్రి సంభవించింది. ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న కార్మికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగింది.
ఈ నేపథ్యంలో, ఊపిరి ఆడక వీరంతా ప్రాణాలు విడిచారు. రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు దట్టంగా అలముకున్న పొగను చూసి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఫైటర్స్ వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనపై నజ్రాన్ గవర్నర్ అబ్దుల్ అజీజ్ విచారణకు ఆదేశించారు. మరోవైపు, బాధితులకు సాయం అందించేందుకు జెడ్డా నుంచి భారత కన్సులేట్ బృందం నజ్నాన్ కు వెళ్లింది. నజ్రాన్ పట్టణంలో 40 వేలకు పైగా తెలుగు వారు ఉన్నారు.