: 15 ఏళ్లు కూడా లేవు.. ప్రేమలో పడ్డాడు... తిరస్కరణతో ఆత్మహత్యాయత్నం చేశాడు!
సినిమాల ప్రభావమో, టీవీల ప్రభావమో కానీ, చిన్న వయసులోనే పిల్లలు ప్రేమమత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండల కేంద్రంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతూ, హాస్టల్ లో ఉంటున్న 9వ తరగతి బాలుడు... తన తరగతి గదిలోని బాలికను ప్రేమించాడు. పట్టుమని పదిహేనేళ్లు కూడా రాకుండానే, చేసేది తప్పో ఒప్పో తెలియని వయసులోనే సదరు ప్రియురాలికి బహుమతి పంపాడు. దానిని ఆమె తిరస్కరించింది.
దీంతో మనస్తాపం చెందిన సదరు బాలుడు హాస్టల్ లో గుళికల మందుతిని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న బాలుడ్ని సిబ్బంది మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడు హాస్టల్ లో ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నాడని, సీట్ల కేటాయింపులో స్థానం దక్కనప్పటికీ హాస్టల్ లో ఉంటున్నాడని హాస్టల్ వార్డెన్ తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు ఆయన తెలిపారు.