: 1962 సరే...మరి 1967 సంగతి మర్చిపోయారా?: చైనాకు గతాన్ని గుర్తు చేస్తున్న భారత మాజీ సైనికాధికారులు


డోక్లామ్ సరిహద్దుల్లో చొరబడే ప్రయత్నంలో భారత్ ను హెచ్చరిస్తూ చైనా మేధావులు, చైనా మీడియా పలు కథనాలు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా 1962లో చైనా చేతిలో భారత్ ఓటమిపాలైందని పేర్కొంటూ ఎద్దేవా చేశారు. దీనిపై భారత్ మాజీ సైనికాధికారులు మరో  విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 1962లో భారత్ వెనకడుగు సంగతి పక్కనపెడితే...1967 సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 1967 ఆగస్టులో సిక్కిం సెక్టార్‌ లోని నాథు లా పాస్ (మార్గం) వద్దకు చైనా సైన్యం రహస్యంగా చొచ్చుకువచ్చింది. దీనిని స్వాధీనం చేసుకుని సిక్కింని తన అధీనంలోకి తీసుకోవచ్చని చైనా భావించింది. దీంతో భారత భూభాగంలో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా కందకాలను కూడా తవ్వింది. దీన్ని గమనించిన భారత సైనికులు వాటిని నిలిపివేయమని వెంటనే విజ్ఞప్తి చేశారు.

 అయితే దానిని ఏమాత్రం లక్ష్యం చేయని చైనా భారత సైనికులపై కాల్పులు కూడా ప్రారంభించింది. వెంటనే రంగంలోకి దిగిన భారత సైనికులు ఎదురొడ్డారు. దీంతో చో లా పాస్ (మార్గం)పై కూడా చైనా కాల్పులకు దిగుతూ దీనిని ఆక్రమించే ప్రయత్నం చేసింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో భారత దళాల ధాటికి తట్టుకోలేక చైనా సైనికులు పారిపోయారు. ఈ ఘటనలో భారత్ 88 మంది సైనికులను కోల్పోగా, చైనా 450 మంది సైనికులను కోల్పోయింది. చో లా పాస్ లో కూడా ఇదే అనుభవం చైనాకు ఎదురైంది. అయితే అప్పట్లో భారత రక్షణ సమాచారం రహస్యంగా ఉండేది..దీంతో ఆ ఘటనలు బయటకు రాకపోవడంతో భారత విజయాలు వ్యాప్తిలోకి రాలేదు. 

  • Loading...

More Telugu News