: అబ్దుల్ కలాం జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం!
మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జీవిత విశేషాలు, వస్తువులతో కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన మ్యూజియం గురువారం ప్రారంభంకానుంది. `డాక్టర్ అబ్దుల్ కలాం స్మృతీ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ స్పేస్` పేరుతో ఉన్న ఈ మ్యూజియాన్ని ఇస్రో మాజీ చైర్మన్ డా. కె. రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇందులో కలాంకు చెందిన వస్తువులు, పుస్తకాలు, అరుదైన చిత్రపటాలు, రాకెట్లు, ఆయన సూక్తులు, రాసిన పుస్తకాలు వంటి వివిధ జ్ఞాపకాలను ప్రదర్శించనున్నారు. దీని ప్రారంభోత్సవ వేడుకకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కే శివన్, కేరళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వి. శశి హాజరుకానున్నారు. యువతకు మార్గదర్శం చేసే ఉద్దేశంతో నిర్మించిన ఈ మ్యూజియాన్ని భారత దేశానికి అంకితం చేస్తున్నట్లు డా. కలాం స్మృతీ ఇంటర్నేషనల్ సీఈఓ శైజు డేవిడ్ ఆల్ఫీ తెలిపారు.