: విదేశీ గడ్డపై భారత్‌కు అవమానం... బిచ్చమెత్తిన క్రీడాకారిణి!
విదేశాల్లో జరిగే ప్రపంచవ్యాప్త టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఎంతో కష్టపడాలి. వ్యయప్రయాసలకు ఓర్చుకోవాలి. ప్రభుత్వం కొద్దిగా కనికరిస్తే వ్యయం గురించి పట్టించుకోకుండా ఆట మీద ఏకాగ్రత పెట్టి పతకం సాధించొచ్చు. కానీ ఎక్కడ? కష్టపడి పతకం సాధించినా కనికరించే దిక్కులేక విదేశీ గడ్డ మీద బిచ్చమెత్తుకుందో క్రీడాకారిణి. ఇది నిజంగా భారతదేశానికి సిగ్గు చేటు.
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగే పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి వెళ్లిన కంచన్‌మాల పాండేకు ఎదురైన చేదు అనుభవమిది. ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులు సరైన సమయానికి అందక, కోచ్ కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయినపుడు దిక్కుతోచని స్థితిలో డబ్బుల కోసం బిచ్చమెత్తుకోవాల్సి వచ్చింది. పోటీలో రజత పతకం నెగ్గిన సంతోషం కూడా ప్రభుత్వ జాప్యంతో నీరుగారి పోయిందని కంచన్‌మాల బాధపడింది.
తాను ఈ స్థాయికి రావడానికి ఇప్పటికే రూ. 5 లక్షల వరకు అప్పు చేసినట్లు, బెర్లిన్ ఖర్చులు కూడా తానే చెల్లించినట్లు కంచన్ చెప్పింది. ఈ ఏడాది భారత్ నుంచి బెర్లిన్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఏకైక మహిళ స్విమ్మర్ ఆమె. తన పరిస్థితిని తలచుకొని, అధికారులకు మేమంటే ఎందుకు అంత చిన్నచూపు? అంటూ వాపోతోంది. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నించగా ఎవరికి వారు తమ పైవారి మీద రుద్దేసి చేతులు దులుపుకుంటున్నారు.
అలాగే ఈ విషయంపై ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ఘాటుగా స్పందించాడు. `ఇది కచ్చితంగా తప్పు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి` అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన ప్రధాని మోదీ, క్రీడా మంత్రి విజయ్ గోయల్‌ని ట్యాగ్ చేశారు. మరి వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి!