: గంగూలీని బుజ్జగించిన సచిన్.. ముంబై కార్డు కూడా పని చేసింది!
ఏదైతేనేం, చివరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను అనుకున్నది సాధించాడు. తాను ఎంతో ఇష్టపడే రవిశాస్త్రిని హెడ్ కోచ్ పదవిలో కూర్చోబెట్టాడు. వాస్తవానికి ఈ పదవి సెహ్వాగ్ కు దక్కేదే. కానీ, కోచ్ గా సెహ్వాగ్ కు అనుభవం తక్కువుండటం శాస్త్రికి కలసి వచ్చింది. దీనికి తోడు సచిన్ కూడా మద్దతు పలకడంతో రవిశాస్త్రికి లైన్ క్లియర్ అయింది. వాస్తవానికి శాస్త్రిని హెడ్ కోచ్ చేయడం క్రికెట్ అడ్వైజరీ కమిటీ ముగ్గురు సభ్యుల్లో ఒకడైన సౌరవ్ గంగూలీకి ఇష్టం లేదు. వీరిద్దరి మధ్య ఉన్న పాత గొడవలే దీనికి కారణం. ఈ కారణంగానే కోచ్ పదవి కోసం రవిశాస్త్రి మొదట్లో దరఖాస్తు కూడా చేసుకోలేదు. అప్లై చేసినా, తనను ఈ పదవికి ఎంపిక చేయరనే డౌట్ శాస్త్రిలో ఉంది.
అయితే, సచిన్ మద్దతు పలకడంతో రవిశాస్త్రికే పదవి దక్కింది. వీరిద్దరూ ముంబైకే చెందిన వారు కావడం కూడా శాస్త్రికి కలసివచ్చింది. ఈ నేపథ్యంలో, శాస్త్రిని పక్కన పెట్టేసిన గంగూలీకి సచిన్ నచ్చచెప్పాడట. సచిన్ తనకు మంచి మిత్రుడు కావడంతో గంగూలీ కాదనలేక పోయాడు. దీనికి తోడు కోహ్లీ కూడా రవిశాస్త్రే కావాలని కోరుతుండటంతో.... ఎట్టకేలకు రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు. 2019 ప్రపంచ కప్ వరకు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. మరి కోహ్లీ, శాస్త్రిల కాంబినేషన్ లో తదుపరి వరల్డ్ కప్ ను టీమిండియా సాధిస్తుందో? లేదో? వేచి చూడాలి.