: వాడు ఉగ్రవాది అయితే శిక్షించండి... కుటుంబం మొత్తం అవమానాల పాలవుతోంది: సందీప్ శర్మ తల్లి
తన కుమారుడు ఉగ్రవాదిగా మారినట్టు రుజువైతే అతనిని కఠినంగా శిక్షించాలని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాది సందీప్ శర్మ అలియాస్ అదిల్ తల్లి స్పష్టం చేశారు. అదిల్ ను అరెస్టు చేసిన నేపథ్యంలో అతనికి కుటుంబంతో గల సంబంధాలపై కన్నేసిన యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు అతని తల్లి, వదినలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అదిల్ తల్లి పార్వతి మాట్లాడుతూ, తన కుమారుడు అలా మారి ఉండడని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఒకవేళ తన కుమారుడు ఉగ్రవాదిగా మారినట్టు రుజువైతే అతనిని శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. తన కుమారుడి తీరు కారణంగా తమ కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, తీవ్ర అవమానాల పాలవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.