: షాప్ కి వెళ్లమంటే వెళ్లనందుకు... కూతురిని చావగొట్టి చంపేసిన తల్లి!
బిడ్డకు తల్లిని మించిన రక్షణ ఎక్కడా దొరకదని అంటారు. తన బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతుంది తల్లి. కానీ, రంగారెడ్డి జిల్లాలోని పహాడీషరీఫ్‌లో మాత్రం ఈ రోజు ఓ తల్లి.. అమ్మతనానికే మచ్చతెచ్చే పనిచేసింది. తన బిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించింది. చెప్పిన మాట వినలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆగ్రహం తెచ్చుకుని గొడ్డుని బాదినట్లు బాదింది. దీంతో తల్లిచేతిలో ఆ ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. జంజంకాలనీలో ఉండే ఫిరోజ్‌బేగం తన కూతురు ఫెర్దోస్ ఫాతిమా(8)ను ఈ రోజు మధ్యాహ్నం షాపుకి వెళ్లమని చెప్పిందని అన్నారు. అయితే, ఆ బాలిక తాను ఆడుకుంటున్నానని, షాపుకి వెళ్లనని చెప్పిందని అన్నారు.
దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆ తల్లి 'నా మాటకే ఎదురుచెబుతావా?' అంటూ తన బిడ్డను కర్రతో చావగొట్టిందని పోలీసులు తెలిపారు. తన తల్లి కొట్టిన దెబ్బలకు ఆ బాలిక ఒంటిపైన, తలపైన బలమైన గాయాలు అయ్యాయని చెప్పారు. అనంతరం ఆ బాలికను ఆమె తల్లే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ బాలిక అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారని అన్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.