: విజయవాడలో ఆనాటి జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి: కళాతపస్వి కె.విశ్వనాథ్
విజయవాడలోనే స్కూల్ ఫైనల్ వరకు తాను చదువుకున్నానని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం, అభిరుచి సంస్థ సంయుక్తంగా విశ్వనాథ్ ను ఈ రోజు సన్మానించనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడకు వచ్చిన ఆయన్ని ఓ న్యూస్ ఛానెల్ పలకరించగా, బెజవాడతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. విజయవాడలో స్కూల్ ఫైనల్ అయిన తర్వాత, డిగ్రీ చదివేందుకు గుంటూరు వెళ్లానని, అక్కడి నుంచి మద్రాసు వెళ్లానని చెప్పారు. విజయవాడలో.. కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ గుడి, స్కూళ్లతో తనకు చాలా అనుబంధం ఉందని అన్నారు. కృష్ణమ్మ చెంత తిరిగిన తీపి జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయని చెప్పిన విశ్వనాథ్, కళలకు ప్రాంతీయ భేదాలు లేవని అన్నారు.