: మనుషుల అక్రమ రవాణాలో చైనా నెం.1: అమెరికా రిపోర్ట్
మానవుల అక్రమ రవాణాలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా దాటిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదికలో తెలిపింది. ప్రపంచంలో జరుగుతున్న మనుషుల అక్రమరవాణాలో చైనా అధ్వానమైన స్థానం టైర్ 3 కేటగిరీలో చోటు సంపాదించుకుందని పేర్కొంది. వాస్తవానికి టైర్ 3లో చైనా గత రెండేళ్ల క్రితమే చేరిందని, అయితే దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావంతో అప్పుడు ఈ విషయాన్ని ప్రకటించలేదని తెలిపింది. ఈ సూచికలో ‘టైర్ 3’ కేటగిరిలో చేర్చిన దేశంతో అమెరికా వాణిజ్యం జరపకుండా ఆంక్షలు ఉన్నాయి. ప్రధానంగా టైర్ 3లో చేర్చిన దేశానికి అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందదు.
చైనా నుంచి అక్రమంగా రవాణా అవుతున్న వారిలో మహిళలు, పిల్లలు కూడా అధికంగానే ఉన్నారు. వారితో కొందరు కూలీ పనులు చేయించుకుంటుండగా, మహిళలను వ్యభిచారిణులుగా మార్చుతున్నారు. మరికొందరిని భిక్షగాళ్లుగా చేస్తున్నారు. మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చైనాలో కఠిన చట్టాలు లేవని అమెరికా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది ప్రజలు అక్రమంగా రవాణా అయ్యారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అమెరికా ప్రస్తుత సర్కారు కృషి చేస్తోందని తెలిపారు.