: ప్రముఖ కార్టూనిస్ట్ మంగేశ్ టెండూల్కర్ కన్నుమూత!
ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత, సామాజిక కార్యకర్త మంగేశ్ టెండూల్కర్ (83) కన్నుమూశారు. గత మూడేళ్లుగా బ్లేడర్ క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం భరించలేని నొప్పికి గురైన ఆయన్ని పుణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నిన్నరాత్రి మంగేశ్ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో ఆయన మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు.
కాగా, మంగేశ్ తన చివరి రోజుల వరకు కార్టూన్లు వేస్తూనే గడిపారు. తన కార్టూన్లు, కారికేచర్ల ద్వారా ట్రాఫిక్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పోస్ట్ కార్డులపై సందేశంగా రాసి, వాటిని తానే స్వయంగా సిగ్నల్స్ వద్ద నిలబడి వాహనదారులకు పంచేవారని మంగేశ్ సన్నిహితులు చెబుతుంటారు. మంగేశ్ టెండూల్కర్ కు భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. మంగేశ్ సోదరుడు దివంగత విజయ్ టెండూల్కర్ ప్రఖ్యాత నాటక రచయిత.