: ఆ దాడి మేం చేయలేదు... అది భారత ఇంటెలిజెన్స్ బృందాల పనే!: లష్కర్ ఎ తొయిబా
అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడికి తాము పాల్పడలేదని, ఇది భారత ఇంటెలిజెన్స్ వర్గాల తప్పిదమేనని తీవ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబా ప్రకటించింది. సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని దక్షిణ అనంతనాగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడికి కారణం లష్కర్ ఎ తొయిబానే అని ఆధారాలు ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాల మాటలను ఉగ్రవాద సంస్థ ప్రతినిధి అబ్దుల్లా ఘజ్నవీ ఖండించారు.
'దైవ భక్తుల మీద దాడి చేయడం ఇస్లాం మత కట్టుబాట్లకు వ్యతిరేకం. అలాంటి చర్యలను మేం పూర్తిగా ఖండిస్తాం. కశ్మీరీలు ఇలాంటి తప్పు చేయరు. వారు ఇంతవరకు యాత్రికుల మీద ఎలాంటి దాడికి పాల్పడలేదు. ఇదంతా భారత మేధావి వర్గం పనే. వారి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్ హిందువుల్ని వాడుకున్నారు. ఇప్పుడు అమర్‌నాథ్ యాత్రికులను వాడుకుంటున్నారు' అంటూ ఘజ్నవీ మండిపడ్డారు. గుజరాత్ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై తీవ్రవాదులు చేసిన దాడిలో ఏడుగురు మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.