: బాలయ్యతో 10 నిమిషాలు మాట్లాడితే బూస్ట్ తాగినట్టు ఉంటుంది: డైరెక్టర్ కేఎస్ రవికుమార్
బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తనకు రావడం పట్ల ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ అన్నారు. ఆయనతో పది నిమిషాలు మాట్లాడినా, బూస్ట్ తాగినంత ఎనర్జీ వస్తుందని చెప్పారు. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వమని అన్నారు. కష్టపడి పనిచేయడం ఆయన నైజమని కొనియాడారు. లవ్ సీన్ల గురించి చెబితే ఇప్పటికీ ఎంతో ఆసక్తిగా వింటారని చెప్పాడు. తమ కాంబినేషన్లో రాబోయే సినిమాకు ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదని... కానీ, కచ్చితంగా సింహగర్జనలాంటి పవర్ ఫుల్ టైటిల్ ఉంటుందని తెలిపారు.
ఎన్టీఆర్ లోని నటన, ప్రేమ, అభిమానం, వీరత్వం, గాంభీర్యం, రాజకీయ కీర్తి అన్నీ బాలయ్యలో ఉన్నాయని చెప్పారు. రాముడు, కృష్ణుడు అంటే తమిళవాళ్లకు కూడా ఎన్టీఆరే గుర్తుకు వస్తారని చెప్పారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా తమిళ ఆడియో ఫంక్షన్ నిన్న చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు కేఎస్ రవికుమార్ తో పాటు, హీరో కార్తి కూడా వచ్చాడు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పైవిషయాలను పేర్కొన్నారు.