: ధర్నాలో కూర్చుని మూడేళ్ల చిన్నారి నినాదాలు... అమ్మా నాన్నలపై కేసు!
మూడేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కూర్చుని ధర్నా చేయడంతో పాటు నినాదాలు కూడా చేస్తుండటంతో, పోలీసులు బాలిక అమ్మానాన్నలపై కేసు పెట్టిన ఘటన తిరువనంతపురంలో జరిగింది. ఇక్కడి వైద్య కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ పెద్ద కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ, గత ఐదున్నర నెలలుగా సురేష్, రమ్య దంపతులు కేరళ సచివాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. వారి ధర్నాకు తమ చిన్న కుమార్తె దుర్గను కూడా తీసుకు వస్తున్నారు.
ధర్నాలో పాపను కూర్చోబెట్టవద్దని పోలీసులు వారించినా వినలేదు. ఒకవేళ తమ కుమార్తె దుర్గకు కూడా అనారోగ్యం తలెత్తి, అటువంటి పరిస్థితి వస్తే, తమకు భరించే శక్తి లేదని చెబుతూ, పాపతోనూ నినాదాలు చేయించారు. దీంతో సుమోటో కింద ఆ తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జువైనల్ జస్టిస్ సెక్షన్ 23 కింద తాము ఫిర్యాదు చేయగా, కోర్టు పరిగణనలోకి తీసుకుందని పోలీసు వర్గాలు తెలిపాయి. తాము ఎన్నిసార్లు హెచ్చరించినా, వారు విననందునే ఈ పరిస్థితి వచ్చిందని వెల్లడించాయి.