: బాలకృష్ణ సినిమాకు 'నో' చెప్పాను.. చెర్రీ సినిమా మిస్సయ్యాను!: డా. రాజశేఖర్
యాంగ్రీ హీరోగా సినీ అభిమానులను అలరించిన రాజశేఖర్ కొంతకాలంగా సక్సెస్ కొట్టడంలో విఫలమవుతున్నారు. తాజాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆయన చిత్రం 'గరుడవేగ' విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాలో వాస్తవానికి తానే విలన్ గా నటించాల్సి ఉందని... అంతా ఓకే అనుకున్న సమయంలో అరవింద్ స్వామితోనే ఆ పాత్రను చేయించాలనుకుంటున్నట్టు నిర్మాత తెలిపారని రాజశేఖర్ చెప్పారు. ఈ సినిమా తమిళ వర్షన్ లో అరవింద్ స్వామి నటించడం వల్ల... ఆయనకు చెందిన కొన్ని సోలో సీన్స్ ను మళ్లీ రీషూట్ చేయాల్సిన అవసరం ఉండదన్న ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
బాలయ్య 102వ సినిమా విలన్ కోసం కూడా తనను సంప్రదించారని రాజశేఖర్ చెప్పారు అయితే, విలన్ పాత్ర రొటీన్ గా ఉండటంతో తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. మంచి కథ ఉన్న విలన్ పాత్ర వస్తే నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.