: వైకాపాలోకి 'కోట్ల' కుటుంబం!
మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా, మాజీ మంత్రిగా పని చేసిన అనుభవంతో పాటు, కర్నూలు జిల్లాలో అపారమైన ప్రజాభిమానం ఉన్న 'కోట్ల' కుటుంబ పెద్ద కోట్ల సూర్యప్రకాశరెడ్డి వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే భవిష్యత్ లేదని భావిస్తున్న ఆయన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మారాలని తొలుత భావించారు. అయితే, ఇప్పుడు మాత్రం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న కోట్ల కుటుంబానికి డోన్, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించినా, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, ఆ పార్టీని వీడకుండా ఉన్నారు.
ఇప్పుడు తన రాజకీయ వారసుడిగా కుమారుడిని నిలపాలని భావిస్తున్న ఆయనకు, కార్యకర్తల నుంచి వైకాపాలోకి చేరాలని ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాశరెడ్డి వైకాపాలో చేరాలని అనుకుంటే, ఆయన్ను ఘనంగా పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ కూడా నిర్ణయించినట్టు సమాచారం. కాగా, గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో వాటిని ఆయనే స్వయంగా కొట్టి పారేశారు. వైకాపాలో చేరే విషయంలో మాత్రం తన మనసులో ఏముందోనన్న విషయాన్ని ఆయనింకా వెల్లడించక పోవడం గమనార్హం. ఏ పార్టీలో చేరినా, భారీ బహిరంగ సభ పెట్టి, తన సతీమణి సుజాతమ్మ, తనయుడు రాఘవేంద్రరెడ్డిలతో కలసి పార్టీ మారాలన్నది కోట్ల సూర్యప్రకాశరెడ్డి అభిమతమని సమాచారం.