: వెంకయ్య స్వర్ణభారత్, సుజనా చౌదరి ట్రస్టులకు హోం శాఖ నోటీసులు... మరో 6 వేల సంస్థలకు కూడా!
ఎన్జీవోలుగా రిజిస్టరై, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్టరు కాకుండా, విదేశాల నుంచి నిధులు పొందాయన్న ఆరోపణలపై 5,922 సంస్థలకు కేంద్ర హోం శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటిల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారత్ ట్రస్టు, సుజనా చౌదరి నిర్వహిస్తున్న సుజనా చారిటబుల్ ట్రస్టులతో పాటు శ్రీసత్యసాయి మెడికల్ ట్రస్ట్ వంటి ప్రముఖ సంస్థలున్నాయి.
ప్రతి సంవత్సరమూ ఆదాయ రిటర్నులు సమర్పించాల్సిన ఈ సంస్థలు 2010 నుంచి 2015 మధ్య రిటర్నులు దాఖలు చేయలేదని తెలుస్తోంది. ఇక నోటీసులు అందుకున్న మిగతా ప్రముఖ సంస్థల్లో ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీ రామకృష్ణ సేవాశ్రమం, ఇందిరా గాంధీ కళాక్షేత్రం, నెహ్రూ స్మారక మ్యూజియం - గ్రంథాలయం, ఇగ్నో వంటి స్వచ్ఛంద సంస్థలున్నాయి. జూలై 23లోగా నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే, రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.