: బాలీవుడ్ నటి అనుష్క శర్మకు క్లీన్ చిట్.. రెండు నెలలైనా గడవకముందే మాట మార్చిన బీఎంసీ!


బాలీవుడ్ నటి అనుష్క శర్మకు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) క్లీన్ చిట్ ఇచ్చింది. అనుష్క శర్మ నివసిస్తున్న వెర్సోవా టవర్‌లోని 20వ అంతస్తులోని నడవలో పెద్ద జంక్షన్ బాక్స్ అమర్చినట్టు అనుష్కపై పక్క ఫ్లాట్‌లోని వ్యక్తి ఒకరు ఇటీవల ఫిర్యాదు చేశారు. మొదట్లో దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్న లోకల్ వార్డ్ ఆఫీస్ తాజాగా ఫిర్యాదుదారు పేర్కొన్న సాధారణ నడవ అనుష్కకు చెందినదే కాబట్టి అందులో ఎటువంటి నిబంధన అతిక్రమణ లేదంటూ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.

16వ అంతస్తులో నివసించే సునీల్ బాత్రా అనుష్క శర్మ అమర్చిన జంక్షన్ బాక్స్‌పై మునిసిపల్ కమిషనర్‌ అజయ్‌ మెహతాకు ఫిర్యాదు చేశారు. జంక్షన్ బాక్స్ అమర్చి ఆ ఫ్లోర్ మొత్తం వైర్లతో నింపేశారని, అలాగే రెండు చెక్క కేబినెట్లు ఏర్పాటు చేశారని, ఇది ఫైర్ బ్రిగేడ్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన ఫిర్యాదుతో కదిలిన బీఎంసీ అనుష్క అమర్చిన జంక్షన్ బాక్స్‌ను పరిశీలించి ఇది చాలా ‘అభ్యంతరకరమమైన చర్య’ అని పేర్కొంది. అయితే, రెండు నెలలు ముగిసే సరికి బీఎంసీ మాట మార్చింది. ఫిర్యాదుదారుడికి లేఖ రాస్తూ ఎలక్ట్రికల్ జంక్షన్ బాక్సులను గోడకు అమర్చారని, ఆమె తన ఇంట్లోలానే బయట కూడా అమర్చుకున్నారని, ఇందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు. అంతేకాదు ఆ నడవ అనుష్కదే కావడంతో ఆమె ఇష్టానుసారం ప్రవర్తించవచ్చంటూ ఫిర్యాదు దారుడికి షాకిచ్చింది. ఈ సమాధానంపై బాత్రా మండిపడుతున్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, సాధారణ నడవను ఇలా ఉపయోగించుకునేందుకు అందరికీ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News