: 'వారి బలిదానాల ముందు నేను చేసే సాయం ఏపాటిది?': గొప్ప మనసు చాటుకున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్

చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు పంజా విసిరి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫ్లాట్లు నిర్మించేందుకు ప్రముఖ సినీ నటుడు వివేక్ ఓబెరాయ్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఆర్పీఎఫ్ జవాన్ల బలిదానాల ముందు తాను చేసే సాయం చాలా చిన్నదని అన్నాడు. దేశ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను స్మరిస్తూ నివాళిగా వారి కుటుంబాలకు ఈ ఫ్లాట్లను ఇస్తున్నానని తెలిపాడు.

 జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచి, వారిని గౌరవించేందుకు తనకు తోచిన మార్గం ఇదని వివేక్ ఓబెరాయ్ తెలిపాడు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కార్గిల్, సియాచిన్ వంటి చోట్ల విధులు నిర్వర్తించడం సాధారణ విషయం కాదని, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని నిలబడాల్సి ఉంటుందని, అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వారికే చెల్లిందని తెలిపాడు. కాగా, తన రెమ్యూనరేషన్ తో జవాన్ల కుటుంబాలకు ఇళ్లు కట్టివ్వడంపై దేశ వ్యాప్తంగా వివేక్ ఓబెరాయ్ పై అభినందనల వర్షం కురుస్తోంది. 

More Telugu News