: కన్నీరు పెట్టించిన ఘటన... వీపున చంటి బిడ్డ... చేతుల్లో మరిది శవం!


సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన జార్ఖండ్ లోని ఛత్రా జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... సిడ్పా గ్రామానికి చెందిన రాజేంద్ర ఒరాన్ అనే యువకుడిని ఓ పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాజేంద్ర మృతి చెందాడని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

దీంతో, దీనిని మనసులో పెట్టుకున్న వైద్యులు అతని శవాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వలేదు. ఎంత బతిమాలినా ఉపయోగం లేకపోవడంతో మృతుడి అన్న, వదినలు తామే శవాన్ని తీసుకెళడానికి సిద్ధపడ్డారు. ఓపక్క తన చంటి బిడ్డను వీపుకి కట్టుకుని... మరోపక్క మరిది శవాన్ని భర్తతో కలసి సాయం పట్టింది. దీంతో స్థానికులు చలించిపోయి, కన్నీటి పర్యంతమయ్యారు. వారితోపాటు సాయంగా వెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై మీడియాలో ఫోటో సహిత కథనాలు రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు దీనికి కారణమైన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.

  • Loading...

More Telugu News