: భారత్ కనుక దలైలామా కార్డును ఉపయోగిస్తే... తనను తాను తగలబెట్టుకున్నట్టే!: చైనా తీవ్ర వ్యాఖ్యలు


భారత్‌పై చైనా మీడియా మరోమారు కారు కూతలు కూసింది. ప్రస్తుతం సిక్కిం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు ‘టిబెట్ కార్డు’ను ఉపయోగించుకుంటే కనుక భారత్ తనను తాను తగలబెట్టుకున్నట్టేనని చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. లడఖ్ సరస్సు తీరంలో టిబెట్ జెండాను ఎగరవేయడాన్ని ఎత్తిచూపుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్-చైనా సరిహద్దులో ఉన్న బ్యాంగాంగ్ సరస్సు (భారత్‌లో ప్యాంగాంగ్ లేక్) సరిహద్దులో టిబెట్ జాతీయ  జెండాను ఎగరవేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఈ లడఖ్ సరస్సును వ్యూహాత్మకంగా పరిగణిస్తారు.

ఉత్తర భారతదేశంలోని ప్రవాస టిబెటన్ పరిపాలనా యంత్రాంగం ఈ ప్రాంతంలో జెండాను ఎగురవేయడం ఇదే తొలిసారని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. టిబెట్‌ విషయంలో భారత్ అనవసరంగా వేలు పెడితే, పతాకావిష్కరణ లాంటివి చేస్తే భారత్ తనను తాను తగలబెట్టుకున్నట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సరిహద్దు సమస్యలు, టిబెట్ వ్యవహారాల్లో తలదూరిస్తే చైనా చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది.

అంతేకాదు, సరిహద్దులో స్టాండాఫ్‌పై భారత్ పునరాలోచించాలని హితోక్తులు పలికింది. కాగా, ఏప్రిల్‌లో దలైలామా అరుణాచల్‌లో పర్యటించినప్పటి నుంచి చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ అక్కడ దలైలామా పర్యటించడాన్ని చైనా తీవ్రంగా నిరసించింది.

  • Loading...

More Telugu News