: అమర్నాథ్ ఉగ్రదాడిపై స్పందించిన మోదీ.. పిరికిపందల చర్యలు భారత్ ఐక్యతను దెబ్బతీయలేవని వ్యాఖ్య!
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్రమోదీ ఖండించారు. దానిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఇటువంటి ద్వేషపూరిత దాడులు దేశ ఐక్యతను దెబ్బతీయలేవన్నారు. జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీతో మాట్లాడి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, అనంతనాగ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
‘‘శాంతియుతంగా సాగుతున్న అమర్నాథ్ యాత్రపై దాడి బాధాకరం. మాటలకందనంత బాధగా ఉంది. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలి’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇటువంటి చర్యల వల్ల ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలన్న భారత్ లక్ష్యం మరింత బలపడిందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇది మానవత్వంపై జరిగిన దాడి అని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అభివర్ణించారు. అమర్నాథ్ యాత్రలో భద్రతా లోపాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.