: ఆ టీవీ షోలు శవాల మీద డబ్బులు ఏరుకుంటాయి!: యండమూరి వీరేంద్రనాథ్ ఘాటు వ్యాఖ్యలు
కలహాల కాపురాలను కలిపే నిమిత్తం కొన్ని టీవీ ఛానెల్స్ లో వచ్చే ఆయా షోలను చూసి ప్రేక్షకులు ఆనందిస్తుండటం చాలా విచారకరమని ప్రముఖ రచయిత, మానసిక వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. ఇలాంటి షోల్లో ఎంత వరకు వాస్తవం ఉందనే విషయమై ఓ న్యూస్ ఛానెల్ ఆయన్ని ప్రశ్నించగా ఆయన సమాధానమిస్తూ, మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూసే అవసరం లేదని అన్నారు. తనకున్న అనుభవంతో తానిచ్చే సలహా ఏంటంటే, టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను బ్రాడ్ కాస్ట్ చేయద్దని సూచిస్తున్నానని, ప్రేక్షకులు కూడా ఇటువంటి ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే ట్యామ్ రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
ఈ తరహా షోలలో పాల్గొనే వారికి కూడా తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని పాప్యులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఆయా టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తనకు తెలుసని, వారిని చూస్తూనే ఉంటానని, వాళ్లకు వాళ్లు మేధావులుగా భావించుకుంటూ ఉంటారని విమర్శించారు. తీర్పులిచ్చేవాళ్ల జీవిత రహస్యాలన్నీ తనకు తెలుసని, ఎందుకంటే, హైదరాబాద్ లోని సైకియాట్రిస్ట్ లందరూ తనకు ఫ్రెండ్సేనని, వారి వద్దకు వీళ్లందరూ వస్తుంటారని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందని, ఈ తరహా టీవీ షోల గురించి చెప్పాలంటే ‘శవాల మీద డబ్బులు ఏరుకోవడమే’ అని యండమూరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.