: జట్టును ప్రకటించి... కోచ్ గురించి పెదవి విప్పని బీసీసీఐ... నేటి సాయంత్రంలోపు ప్రకటన?
శ్రీలంక టూర్ కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలెక్టర్లు చీఫ్ కోచ్ ను మాత్రం ప్రకటించలేదు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ, జూలై 9న కోచ్ ఎవరో ప్రకటిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చెప్పిన రోజు వెళ్లిపోయినా చీఫ్ కోచ్ పై మౌనం దాల్చడంపై అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చీఫ్ కోచ్ పదవికి నేడు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. లండన్ లో ఉన్న సచిన్ ఆన్ లైన్ ద్వారా ప్యానల్ లో కూర్చుంటాడని, మిగిలిన ఇద్దరు సలహాదారులు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారని తెలుస్తోంది. కాగా, ఈ ఎంపిక కమిటీకి గంగూలీ, సచిన్, లక్ష్మణ్ సలహాదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరి ఎంపికే ఫైనల్ కానుంది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రానికి టీమిండియా చీఫ్ కోచ్ ఎవరో తెలిసిపోనుందని తెలుస్తోంది.