: 'రివాల్వర్ రాణి' ప్రేమ కథ సుఖాంతం.. ప్రియుడిని పెళ్లాడిన కిడ్నాపర్!
ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్ జిల్లాలో గత మే 15న వివాహవేడుక వద్దకు వెళ్లి వరుడి తలపై తుపాకీ పెట్టి కిడ్నాప్ చేసిన యువతి ప్రేమ కథ సుఖాంతమైంది. స్థానిక ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న ఆశోక్ యాదవ్, వర్ష అనే యువతితో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే కుటుంబ సభ్యులు బలవంతం చేశారని చెబుతూ అశోక్ యాదవ్ మరో యువతి మెడలో తాళి కట్టబోయాడు. దీంతో ఆగ్రహించిన వర్ష తుపాకీతో పెళ్లి మండపంలోకి వచ్చి, అతని తలకు తుపాకీ గురిపెట్టి అక్కడి నుంచి అతన్ని తీసుకెళ్లిపోయింది.
అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించగా తమ ప్రేమకథను వివరించింది. ఈ ఘటనలో అశోక్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి అంగీకరించడంతో, వీరి వివాహానికి శివసేన రాష్ట్ర అధ్యక్షుడు రతన్ బ్రహ్మచారి ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రుల సమక్షంలో తాళి కట్టడంతో వివాహ తంతుతో పాటు రివాల్వర్ రాణి ప్రేమ కథ సుఖాంతమైంది.