: మహిళలకు ప్రవేశంలేని పవిత్ర దీవికి యునెస్కో గుర్తింపు!
జపాన్‌కు నైరుతి దిశలో ఉన్న ఓ పవిత్ర దీవికి అంతర్జాతీయ విద్యా, సాంకేతిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఒకినోషిమా అని పిలిచే ఈ దీవిలోకి మహిళల ప్రవేశం నిషిద్ధం. పురుషులు కూడా ప్రవేశించడానికి ముందు దిగంబరులై సముద్రంలో స్నానం చేసి పాపప్రక్షాళన చేసుకోవాలి. 700 చదరపు మీ. వైశాల్యం ఉన్న ఈ దీవి లోపలికి ప్రతి ఏడాది మే 27న కేవలం 200 మంది పురుషులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. వీరంతా కలిసి 1904-05 మధ్య కాలంలో రష్యా-జపాన్ యుద్ధంలో అసువులు భాసిన సైనికులకు నివాళులు అర్పిస్తారు. అలాగని వారు ఇక్కడి చిన్న గడ్డి పోచను కూడా తీసుకెళ్లడానికి వీలు లేదు.
ఇక సహజంగా వచ్చే రుతుస్రావం వల్ల మహిళలు అపవిత్రులని ఈ దీవిలోకి వారి ప్రవేశాన్ని నిషేధించినట్లు ఒక వాదన. ఈ ప్రాంతంలో వైయీ వంశీయులు ఉపయోగించిన బంగారు వస్తువులు, సామాగ్రితో కలిపి 80,000 వరకు పురాతన కళాఖండాలు ఉన్నాయని, యునెస్కో గుర్తింపు లభించినంత మాత్రాన ఈ పవిత్ర స్థలాన్ని సందర్శన స్థలంగా మార్చే ప్రసక్తే లేదని ఆ దీవిలో పూజలు నిర్వహించే ముఖ్య పూజారి తకయుకి అషిజు చెప్పారు.