: లవ్ చేసిన అబ్బాయిని వదులుకున్నా... ఇప్పటివరకూ సారీ చెప్పలేదు: నటి మాధవీ లత
'నచ్చావులే' చిత్రంతో తెలుగు తెరంగేట్రం చేసిన కన్నడ ముద్దుగుమ్మ మాధవీలత, తన ప్రేమ గురించి, తనను ప్రేమించిన వాడి గురించి చెబుతూ, అతన్ని వదులుకున్నానని, ఇప్పటివరకూ క్షమాపణలు కూడా చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. హైదరాబాద్ కు వచ్చిన కొత్తల్లో ఓ అబ్బాయితో స్నేహం చేశానని గుర్తు చేసుకున్న మాధవీలత, అతనెంతో కేరింగ్ గా ఉండేవాడని, సమయానికి తిన్నావా? నిద్రపోయావా? అన్న రెండు ప్రశ్నలే అడుగుతూ ఉండేవాడని చెప్పింది. కొన్ని రోజుల తరువాత తనకు అతను లవ్ ప్రపోజ్ చేయడంతో, అందరు అమ్మాయిలు చెప్పేలాగానే 'నీపై అలాంటి అభిప్రాయం లేదు, ఫ్రెండ్ గానే ఉండు' అని చెప్పానని అంది.
ఆ సమయంలో అతను చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ గుర్తుందని, అది తనకెంతో నచ్చిందని, అందరు అబ్బాయిలకూ అది వర్తిస్తుందని అంది. తానిప్పుడు ఫ్రెండ్ గా ఉంటే, అది నిజమైన ఫ్రెండ్ షిప్ అనిపించుకోదని, ఒకసారి లవ్ చేసిన తరువాత, మరో దృష్టితో చూడలేనని చెప్పాడంది. "నీకు వేరే వ్యక్తితో పెళ్లయి, పిల్లలు పుట్టినా ఫ్రెండ్ గా చస్తే చూడను. చనిపోయినా నా లవర్ గానే భావిస్తా" అని అన్నాడని, ఆపై తనను ఇంప్రెస్ చేయాలని ఎన్నడూ చూడలేదని, తాను మాత్రం, అతని ఇగోను హర్ట్ చేస్తూ, బాధపెట్టే విషయాలను ప్రస్తావనకు తెచ్చి, తనతో సంబంధాన్ని తెంచుకున్నానని అంది. కావాలనే ఆ తప్పు చేశానని, అందుకు ఇంతవరకూ సారీ కూడా చెప్పలేదని తన అనుభవాన్ని వెల్లడించింది.