: 'బజరంగీ భాయిజాన్' నటికి రెండేళ్ల జైలు శిక్ష
ఓ చెక్ బౌన్స్ కేసులో నటి అల్కా కౌశల్, ఆమె తల్లికి రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్ల నాటి సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 'బజరంగీ భాయిజాన్'లో కరీనా కపూర్ తల్లిగా, అంతకుముందు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన 'క్వీన్' చిత్రంలో ఆమెకు తల్లిగా అల్కా కౌశల్ నటించింది. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ పేరు తెచ్చుకుంది.
ఈ క్రమంలో అవతార్ సింగ్ అనే రైతు నుంచి రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్న అల్కా, ఆమె తల్లి, డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన వేళ, రూ. 25 లక్షల చొప్పున రెండు చెక్కులు ఇవ్వగా, అవి బౌన్స్ అయ్యాయి. దీనిపై అవతార్ కేసు వేయగా, దిగువ కోర్టు 2015లో రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆపై అల్కా ఆ తీర్పును పంజాబ్ లోని సంగ్ రూర్ కోర్టులో అపీలు చేయగా, ఆ తీర్పునే ఖరారు చేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు.