: గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు డ్రైవర్ల 'ఓవర్ టేక్' ఆటలో మూడో డ్రైవర్ బలి!
అతివేగం ప్రమాదకరం... వేగంగా వెళ్లే వాళ్లకే కాదు, ఇతరులకు కూడా. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద వీడియో చూస్తే ఇలాగే అనిపిస్తుంది. లాంబోర్గని కారు, స్విఫ్ట్ డిజైర్ కారు రెండూ కలసి ఆడిన ఓవర్ టేక్ ఆటలో మారుతి ఎకో నడుపుతున్న 20 ఏళ్ల యువకుడు బలయ్యాడు. గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే మీద జరిగిన ఈ యాక్సిడెంట్ దృశ్యాలు అక్కడి ట్రాఫిక్ కెమెరాలో రికార్డయ్యాయి.
వేగంగా వెళ్తున్న లాంబోర్గని కారును పక్కనే వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఆ ఓవర్ టేక్‌ను తప్పించే ప్రయత్నంలో లాంబోర్గని కారు ఒక్కసారిగా ఎడమ వైపుకు తప్పుకోవడంతో ఆ వెనకాల వస్తున్న మారుతి ఎకో కారును ఢీ కొట్టింది. లాంబోర్గని కారు వేగంగా వెళ్తుండటంతో మారుతి ఎకో బండి గాల్లో ఎగురుతూ పక్కనే ఉన్న అడవిలో పడింది. దీంతో మారుతి ఎకో నడుపుతున్న అర్షద్ అహ్మద్ అక్కడిక్కడే మరణించాడు. ప్రమాదానికి కారణమైన స్విఫ్ట్ డిజైర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేయగా, లాంబోర్గని డ్రైవర్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు.