: జనసేనలో చేరేందుకు అంత పిచ్చి దానిలా కనిపిస్తున్నానా?: రోజా
తాను మరోసారి పార్టీ మారుతానని, త్వరలోనే పవన్ కల్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీలో చేరుతానని వస్తున్న వార్తలపై వైకాపా మహిళానేత రోజా స్పందించారు. "అసలు పవన్ కల్యాణ్ కు ఆయన పార్టీ ఎక్కడుందో, దానికి ఎవరు కమిటీయో, ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో నేనేమీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? పార్టీలు మారడానికో లేదా వెళ్లిపోవడానికో... మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సో నాకు జగన్ ను వదిలి వెళ్లడానికి ఒక్క కారణం చెప్పండి. క్లియర్ కట్ గా నేను చెప్పేశాను. కొన్ని వార్తల కోసం మీరు చూపిస్తున్నారు. కొన్ని మా ఇమేజ్ ని దెబ్బతీసేలాగున్నాయి. ఇలా పార్టీ మారుతుందంటూ... పార్టీ మారాలంటే ఎప్పుడో మారిపోయేదాన్ని. నన్ను రాజకీయంగా తొక్కేస్తున్న వేళ, అడుగడుగునా నాకు ఓ బ్రదర్ లాగా జగన్ రక్షణ ఇచ్చారు. జీవితంలో ఆయన్ను వదిలి వెళ్లే అవసరం లేదు" అని స్పష్టత ఇచ్చారు.
ఇక తనను అసెంబ్లీలోకి రానిచ్చే విషయంలో చంద్రబాబు, లోకేష్ మనసులో ఏముందో తనకు తెలియదని, ఈ విషయంలో తాను వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కూడా స్పందించిందని అన్నారు. మహిళా కాంగ్రెస్ సమావేశాలకు తనను రమ్మని చెప్పి, పాసులిచ్చి, రూము బుక్ చేసి, కారు పెట్టి, చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలీకుండా, తనను కిడ్నాప్ చేసి, అటూ ఇటూ తిప్పి, చివరికి తెలంగాణలో వదిలేశారని రోజా ఆరోపించారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయితే, తాను హోం మంత్రిని అవుతానని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, తానేమీ అటువంటి కమిట్ మెంట్లతో పని చేయడం లేదని అన్నారు.