: కన్నం పెట్టి 3 కేజీల బంగారం దోచుకెళ్లిన ఘరానా దొంగ!
సాధారణంగా దొంగతనం చేయడాన్ని కొన్ని ప్రాంతాల్లో కన్నమేయడమంటారు.... అలా కన్నమేయడానికి నిర్వచనం చెప్పాలని భావించాడేమో.. ఓ దొంగ గచ్చుకు పెద్ద కన్నం పెట్టి కిందనున్న జ్యుయలర్స్ షాపులో ప్రవేశించి మూడు కేజీల బంగారం దోచేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులోని కాటన్ పేటలోని ప్లాటినం లాడ్జ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కంచన్ జ్యుయలర్ షాప్ ఉంది. దీనికి టార్గెట్ పెట్టిన ఒక ఘరానా దొంగ...లాడ్జ్ లోని ఒక గదిని 20 రోజుల పాటు అద్దెకు తీసుకున్నాడు.
రూమ్ లో దిగుతున్న సమయంలో హుస్సేన్ అనే గుర్తింపు కార్డు ఇచ్చాడు. ఉద్యోగాన్వేషణ కోసం వచ్చానని లాడ్జి సిబ్బందికి తెలిపాడు. భోజనం, అల్పాహారం, తేనీరు సేవించేందుకు మాత్రమే బయటకు వచ్చేవాడని, మిగిలిన సమయం మొత్తం గదిలోనే గడిపేవాడని సిబ్బంది తెలిపారు. టీవీని పెద్ద శబ్దంతో పెట్టుకుని తన వద్ద ఉన్న చిన్న యంత్రంతో ప్రతి రోజూ గచ్చుకు రంధ్రం చేసేవాడని పోలీసులు గుర్తించారు. శుక్ర, శనివారాల్లో దుకాణానికి సెలవు కావడంతో ఈ రెండు రోజుల్లో మనిషి దూరేంత రంధ్రం చేసి, అందులోకి బెడ్ పై పరిచే దుప్పట్లను తాడుగా చేసుకుని దుకాణంలోకి దిగి నగల్ని దోచేశాడని పోలీసులు గుర్తించారు.
లాడ్జి సిబ్బంది గుర్తించకుండా ప్రతిరోజూ కొంత మొత్తంలో మంచం కింద ఈ రంధ్రం చేయడం విశేషం. శనివారం రాత్రి అతడు లాడ్జిని ఖాళీ చేసి వెళ్లిపోగా, ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో యజమాని హిమ్మత్ ప్రకాశ్ నగల దుకాణం తెరచి షాక్ కు గురయ్యారు. 1.5 అడుగుల కాంక్రీట్ ను తొలగించిన దుండగుడు మూడు కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లిపోయాడని, వెండి వస్తువులను తాకలేదని తెలిపారు. కాగా, లాడ్జ్ లోని సీసీ పుటేజ్ ఆధారంగా అతనిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.