: అమెరికా అధ్యక్షుడి ఉదారత.. కుమార్తె ఇవాంకా ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రపంచ బ్యాంకు నిధికి 50 మిలియన్ డాలర్ల విరాళం!
మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం అందించేందుకు కుమార్తె ఇవాంకా ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రపంచబ్యాంకు నిధికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ఇవాంకా ట్రంప్ ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్‌తో చేతులు కలిపి మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం కోసం ఓ నిధిని ప్రారంభించారు.
ఈ నిధికి ఇప్పటి వరకు 325 మిలియన్ డాలర్లు సేకరించినట్టు కిమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మహిళలు, మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలను మరింత మెరుగుపరిచేందుకు ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే సాంకేతిక సాయం, పర్యవేక్షణ తదితర వాటిలో శిక్షణ ఇస్తారు. వ్యాపారాలు ప్రారంభించడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న మహిళలకు ఈ నిధి చాలా బాగా ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. లక్షలాదిమంది మహిళల ముఖంలో వెలుగులు విరజిమ్ముతాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని సామాజిక వర్గాల్లో ఉన్న మహిళలకు ఇది సరికొత్త ఆశ అని ఆయన అభివర్ణించారు.