: లాలూకి మళ్లీ ఝలక్కిచ్చిన నితీశ్.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమావేశానికి డుమ్మా... ఆర్జేడీతో మైత్రిపై సందేహాలు!
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌తో కొనసాగుతున్న మైత్రికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ టాటా చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎడమొహం పెడమొహంలా ఉన్న ఇద్దరు నేతల మధ్య మరో మారు దూరం పెరిగింది. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మంగళవారం ఏన్‌డీఏ యేతర పక్షాలు నిర్వహించనున్న సమావేశానికి డుమ్మా కొట్టాలని నితీశ్ నిర్ణయించారు. రాష్ట్రపతి అభ్యర్థి నామినీ విషయంలో నితీశ్ ఇలానే చేశారు. తాజాగా మరోమారు ఆయన తప్పించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఆయన వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండడం వల్లే రాలేకపోతున్నారని జేడీయూ వర్గాలు చెబుతుండగా, మంగళవారం రోజే ఆయన శాసనసభ్యులు, ఎంపీలతో సమావేశం నిర్వహించనుండడం గమనార్హం.
కాగా, గత నెలలో రాష్ట్రపతి అభ్యర్థి నామినీ కోసం నిర్వహించిన 17 పార్టీల మీటింగ్‌కు హాజరు కాని నితీశ్, అదే రోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఎన్డీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు బహిరంగంగా మద్దతు తెలిపి అగ్గి రాజేశారు. అలాగే నోట్ల రద్దు, సర్జికల్ దాడులను కూడా నితీశ్ సమర్థించారు. తాజాగా ఉప రాష్ట్రపతి నామినీ కోసం ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్న నితీశ్ తన ఉద్దేశాన్ని మరోమారు చాటిచెప్పారు.