: ప్రముఖ బెంగాలీ నటి సుమితా సన్యాల్ మృతి!


ప్రముఖ బెంగాలీ నటి సుమితా సన్యాల్ (71) మృతి చెందారు. కోల్ కతాలోని తన నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. సీనియర్ నటి సుమితా సన్యాల్ మృతి చెందడం బాధకు గురి చేసిందని, ఆమె కుటుంబసభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తన సంతాపం తెలుపుతున్నట్టు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, సుమారు 50 బెంగాలీ చిత్రాల్లో సుమితా సన్యాల్ నటించారు. గుడ్డి, మిలీ, ఆశీర్వాద్ అండ్ మేరే అప్నే వంటి హిందీ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా నటించిన 'ఆనంద్' చిత్రంలో సుమిత్రా సన్యాల్ నటించారు. ఫిల్మ్ డైరెక్టర్ సుబోధ్ రాయ్ ను సుమితా సన్యాల్ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు.

  • Loading...

More Telugu News