: అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నా.. రాష్ట్రమంతా తిరుగుతా!: వైఎస్ జగన్


అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నానని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు సభలో జగన్ మాట్లాడుతూ, తాను ప్రకటించిన తొమ్మిది కార్యక్రమాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుపోవాలని, వారి వెంట తాను కూడా ఉంటానని, అక్టోబర్ 27నుంచి పాదయాత్ర చేస్తూ వస్తానని చెప్పారు. దాదాపుగా 6 నెలల పాటు, రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని చెప్పారు. ప్రతి జిల్లాకు వస్తానని, ప్రతి ప్రాంతానికీ తిరుగుతానని, ప్రజలతోనే ఉంటూ పాదయాత్ర చేస్తానని చెప్పారు.

ఇడుపులపాయ నుంచి తన పాదయాత్ర మొదలుపెట్టి తిరుమలకు వెళతానని, మెట్లెక్కి కొండపైకి వెళ్లి దేవుడిని దర్శించుకుంటానని చెప్పారు. అక్కడి నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. 'ఊరూవాడా అందరికీ చెప్పండి .. అన్నొస్తున్నాడు .. మంచిరోజులొస్తున్నాయి అని గట్టిగా చెప్పండి' అని జగన్ పేర్కొన్నారు.

వైఎస్సార్ మాదిరిగానే ప్రజల నుంచి అధికారం తెచ్చుకుంటామని, వైఎస్సార్ మాదిరిగానే ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకుంటామని, దేవుడి ఆశీస్సులతో స్వర్ణ యుగాన్ని అందించగలమని, అలానే, అందరి ఆశీస్సులూ ఉండాలని ఆశిస్తున్నానని, రాబోయే రోజులు తమవేనని, ఇక్కడ ఉన్నవారందిరికీ భరోసా ఇస్తున్నానని, ప్రజలకే కాదు ప్రతికార్యకర్తకు తాను తోడుగా ఉంటానని జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News