: నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది.. 30 ఏళ్లు సీఎంగా ఉండాలని ఉంది: వైఎస్ జగన్
తనకు ముఖ్యమంత్రి కావాలని, 30 ఏళ్లు సీఎంగా ఉండాలనే కోరిక ఉందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన మనసులో మాట బయటపెట్టారు. గుంటూరులో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, 2014లో చంద్రబాబులాగా తాను అబద్ధాలాడి ఉంటే, ముఖ్యమంత్రిని అయ్యేవాడినేమోనని అన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాల్సిన అవసరం తనకు లేదని, అందుకే, ఓట్ల కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పలేదని అన్నారు.
అయితే, భవిష్యత్ తమదేనని, అధికారంలోకి రావడం ఖాయమని, అంతిమంగా గెలిచేది న్యాయమేనని, తమ గెలుపు ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తానని, తొమ్మిది కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. చంద్రబాబు పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని, వారికి గిట్టుబాటు ధర, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, ఆయన పాలనలో కరవు, అకాల వర్షాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు.